యూనీకోడ్ అంటే ఏమిటి?
ప్రతీ అక్షరానికీ ఓ ప్రత్యేక సంఖ్యని యూనీకోడ్ ఇస్తుంది,
ప్లాట్‌ఫామ్ ఏదైనా,
ప్రోగ్రామ్ ఏదైనా,
భాష ఏదైనా.
కంప్యూటర్లు ప్రధానంగా అంకెలతో పని చేస్తాయి. ఒక్కో అక్షరానికీ, వర్ణానికీ ఒక్కో సంఖ్యని కేటాయించి నిక్షిప్తం చేసుకొంటాయి. యూనీకోడ్ కనుగొనబడక ముందు, ఈ విధంగా సంఖ్యలని కేటాయించడంకోసం వందలకొద్దీ సంకేతలిపి (encoding) పద్ధతులు ఉండేవి. ఏ ఒక్క పద్ధతిలోనూ చాలినన్ని వర్ణాలు ఉండేవికాదు: ఉదాహరణకు, ఒక్క ఐరోపా సమాఖ్య లోని భాషలకోసమే చాలా సంకేతలిపి పద్ధతులు కావలసి వచ్చేవి. అంతెందుకు, ఒక్క ఇంగ్లీషు భాషలోని అన్ని అక్షరాలు, సాధారణ వాడుకలో ఉన్న వ్యాకరణ, సాంకేతిక వర్ణాలకే ఏ ఒక్క సంకేతలిపి పద్ధతీ సరిపోయేది కాదు.
ఆ సంకేతలిపి పద్ధతుల మద్య వైరుధ్యాలుకూడా ఉండేవి. అంటే, వేర్వేరు పద్ధతులు ఒక సంకేతసంఖ్యని వేర్వేరు అక్షరాలకు, లేదా వేర్వేరు సంకేతసంఖ్యల్ని ఒకే అక్షరానికి ఉపయోగించేవి. కంప్యూటర్లు (ముఖ్యంగా సర్వర్లు) చాలా రకాలైన సంకేతలిపి పద్ధతులకు అనువుగా ఉండవలసి వచ్చేది; అయినా సరే, వివిధ సంకేతలిపి పద్ధతుల లేదా ప్లాట్‌ఫామ్ ల మధ్య డేటా ప్రయాణించినప్పుడు, ఆ డేటా చెడిపోయే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉండేది.
దాన్నంతటినీ యూనీకోడ్ మార్చివేస్తోంది!
ప్రతీ అక్షరానికీ ఓ ప్రత్యేక సంఖ్యని యూనీకోడ్ అందిస్తుంది..., ప్లాట్‌ఫామ్ ఏదైనా, ప్రోగ్రామ్ ఏదైనా, భాష ఏదైనా సరే. వ్యాపార దిగ్గజాలైన ఆపిల్, HP, IBM, జస్ట్‌సిస్టమ్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, SAP, సన్, సైబేస్, యూనిసిస్, మరియు అనేక కంపెనీలు ఈ యూనీకోడ్ ప్రమాణాన్ని స్వీకరించాయి. ఆధునిక ప్రమాణాలైన XML, జావా, ECMAస్క్రిప్ట్ (జావాస్క్రిప్ట్), LDAP, కోర్బా 3.0, WML లాంటివాటికి యూనీకోడ్ అవసరం. అంతేగాక, ISO/IEC 10646 ని అమలుపరచే అధికారిక పద్ధతిది. చాలా ఆపరేటింగ్ సిస్టములూ, అన్ని ఆధునిక బ్రౌజర్లూ ఇంకా అనేక సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు ఇప్పుడు యూనికోడ్‌ని సపోర్టు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత ప్రముఖ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ధోరణులలో యూనీకోడ్ ప్రమాణ అవతరణా దానిని అందించే ఉపకరణాల లభ్యత ఉన్నాయి.
క్లయింట్-సర్వర్ లేదా బహుళ స్థాయి సాఫ్ట్‌వేర్ ఉపకరణాలలోనూ, వెబ్‌సైట్‌లలోనూ యూనీకోడ్‌ని వాడి (పాత పద్ధతులతో పోల్చినపుడు) ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఒకే సాఫ్ట్‌వేర్ ఉపకరణము లేదా ఒకే వెబ్‌సైట్... వివిధ ప్లాట్‌ఫామ్‌లకు, భాషలకు, దేశాలకు పనికివచ్చేవిధంగా (మళ్ళీ మళ్ళీ తయారుచేసే అవసరం లేకుండానే) యూనీకోడ్ సుసాధ్యం చేస్తుంది. అనేక సిస్టముల మధ్య రవాణాలో డేటా చెడిపోకుండా ఇది వీలు కల్పిస్తుంది.
యూనీకోడ్ కన్సార్టియం గురించి
యూనీకోడ్ కన్సార్టియం అనేది యూనీకోడ్ ప్రమాణపు అభివృద్ధి, వ్యాప్తి, మరియు విస్తృతికై ఏర్పాటైన లాభాపేక్షలేని సంస్థ. ఈ ప్రమాణం ఆధునిక సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు మరియు ప్రమాణాలలోనూ వచన ఉపయోగ విధానాన్ని నిర్ధేశిస్తుంది. కంప్యూటరు మరియు సమాచార ఆధారిత పరిశ్రమకు చెందిన విభిన్న వ్యాపార మరియు స్వచ్ఛంద సంస్థలు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. ఆర్థికపరంగా పూర్తిగా సభ్యత్వ రుసుము మీదే ఆధారపడి సంస్థ నడుస్తుంది.
యూనీకోడ్ ప్రమాణాన్ని అమలుపరిచే మరియు దాని వ్యాప్తికి, అమలుకు తోడ్పడాలనుకునే అన్ని సంస్థలు మరియు వ్యక్తులు, ప్రపంచంలో ఎక్కడున్నా, యూనీకోడ్ కన్సార్టియంలో సభ్యత్వం పొందవచ్చు.
ఇంకా మరింత సమాచారం కోసం
శభ్ధావళి,
యూనీకోడ్ తోడ్పాటు కల్గిన కొన్ని సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు,
సాంకేతిక పరిచయం మరియు
సమాచార వనరులు చూడండి.
translation by Veeven et al.